మా గోనెపాడు గ్రామము కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో ఎన్ హెచ్ 165 జాతీయ రహదారిని ఆనుకొని యున్నది. ఈ గోనెపాడు గ్రామము సుమారు 200 సం॥ల క్రిందట ఒక అగ్రహారముగా ఏర్పడి యున్నది. బృహస్పతి, శుక్రాచార్యది గురొత్తముల మేలిమి వంశాంకుంములైన సనాతన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబముల వారి నివాస స్థానమై ఉండి యున్నది. కాల క్రమేణా ఆ సనాతన ఆచారములు, సాంప్రదాయములు ఈ గ్రామములోని అన్ని వర్గముల వారికీ సంక్రమించి గ్రామమంతా ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ప్రకాశించు చున్నది.
ప్రస్తుతము ఈ గ్రామములో విభిన్న మతములు వారు నివసించు యున్నారు. అయినప్పటికీ వీరు అనాదిగా ఆ బ్రాహ్మణులచే ప్రతిష్ఠించబడిన సనాతన ఆచార వ్యవహారములు. సాంప్రదాయములు ఇప్పటికి కొనసాగించుచునే యున్నారు.గ్రామములో ప్రజలందరూ కూడా భక్తి భావముతో ధర్మ మార్గాని వీడక తమ జీవన యాత్ర కొనసాగించు చున్నారు. గ్రామమునుండి వృత్తి రీత్యా బయటకు వెళ్ళిన వారు కూడా గ్రామముతో ఆధ్యాత్మిక అభివృద్ధికి దైవ కార్యక్రమము భూరి విరాళములు అందచేస్తూ తమ మాతృ భూమిపై మమకారాన్ని మరువక కొనసాగించు చున్నారు.
కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము. శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిషా, అస్సాం, తమిళనాడు ల నుండి సైతం భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు.
సమీపాన కల ఆకివీడు నుండి లాంచీ ల ద్వారా, లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు – కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి – పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది. ఇక్కడ కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది.